చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని తెలుగు దేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కక్షపూరితంగా వ్యవహరించి బాబును జైల్లో పెట్టించారని అధికార వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీతో పొత్తు విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిసి సాగుతామని పవన్ చెప్పారు.
ప్రస్తుతం అత్తయ్య నారా భువనేశ్వరితో కలిసి బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు తాజాగా బ్రాహ్మణిని కలిశారు. కందుల దుర్గేశ్, బాలక్రిష్ణ, శశిధర్, చంద్రశేఖర్ తదితర జనసేన నేతలు బ్రాహ్మణిని కలిసి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఉమ్మడి కార్యచరణ గురించి మాట్లాడారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని జనసేన నేతలు ప్రకటించారు.
బాబు జైల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన, టీడీపీ కలిసి సాగేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు టీడీపీ అధినేత అయిన తన మామయ్య చంద్రబాబు జైల్లో ఉండటం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తన భర్త లోకేష్ ఢిల్లీలో ఉండటంతో బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఆరోపణలు చేశారు. టీడీపీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి భర్త లోకేష్, తండ్రి బాలక్రిష్ణతో ఎప్పటికప్పుడూ బ్రాహ్మణి చర్చిస్తున్నారని తెలిసింది.