స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు విషయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుంచి ఈ బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నరసింహులు ఆదివారం (సెప్టెంబర్ 24) హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్ గెలుపు కోరుకుని తప్పు చేశానని మోత్కుపల్లి అన్నారు.
చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. త్వరలోనే తాను రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడుతానని మోత్కుపల్లి అన్నారు. బాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు వెళ్లాల్సిందేనని మోత్కుపల్లి చెప్పారు. 2019లో జగన్ ను గెలిపించమని ప్రజలను కోరి తాను పొరపాటు చేశానని, ఇప్పుడు తల దించుకుంటున్నానని ఆయన అన్నారు.
నారా భువనేశ్వరి ఉసురు కచ్చితంగా జగన్ కు తగులుతుందని మోత్కుపల్లి అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా బాబును అరెస్టు చేయడం దుర్మార్గమని, సీఎం పదవి శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. లోకేష్ ను కూడా అరెస్టు చేయాలనుకోవడం అన్యాయమని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ముష్టి రూ.371 కోట్ల కోసం బాబు ఆశపడతారంటే ప్రజలు నమ్మటం లేదన్నారు. బాబును ఇబ్బంది పెడితే జగన్ కే నష్టమని, ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి 151 కాదు కనీసం నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో వాడుకున్న తర్వాత తల్లి, చెల్లిని బయటకు పంపిన చరిత్ర జగన్ ది అని, సొంత బాబాయ్ ను చంపిన నేరస్థులను పట్టుకోలేని అసమర్థుడు జగన్ అని మోత్కుపల్లి రెచ్చిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates