ఇగోని వదిలిపెడితే జగన్ ను ఓడించవచ్చు

జగన్మోహన్ రెడ్డిపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు యుద్ధం ప్రకటించారు. రాబోయే ఆరుమాసాలు చాలా కీలకమైనవని చెప్పారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్యనేతల సమావేశంలో నాగబాబు మాట్లాడుతు నేతలందరు ఇగోని వదిలిపెట్టాలన్నారు. రాబోయే ఎన్నికలు జనసేనకు ఎంత కీలకమో అందరు గుర్తించాలన్నారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేంతవరకు నేతలెవరు విశ్రాంతి కూడా తీసుకోకూడదని గట్టిగా చెప్పారు. నేతలు, క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేస్తే జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు.

పార్టీ కార్యక్రమాల నిర్వహణలో నేతల మధ్య ఇగో సమస్యలున్నట్లు నాగబాబుకు అనిపించిందట. ఇదే విషయాన్ని ఆయన నొక్కిచెప్పారు. నేతలైనా క్యాడరైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూసే పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మన సత్తా చూపించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కాబట్టి ఇగోలను పక్కనపెట్టి పార్టీ పటిష్టత కోసం అందరు ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తిచేశారు.

సైకో ముఖ్యమంత్రిని అధికారంలో నుండి దింపే బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు ఒక సంకల్పంలాగ తీసుకోవాలన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి మాట్లాడుతు పార్టీలో మహిళలకు సముచిత స్ధానం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో జగన్ పాలనా విధానాన్ని, అవినీతి, అరాచకాలను నాగబాబు నేతలకు విడమరచిచెప్పారు. వ్యవస్ధలను మ్యానేజ్ చేయటంలో జగన్ ఎంతటి అనుభవజ్ఞుడో ఇప్పటికే అందరికీ అర్ధమైపోయుంటుందన్నారు. కాబట్టి అన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో నేతలు, క్యాడర్ ఐకమత్యంగా ముందుకెళ్ళాలని పిలుపిచ్చారు.

వీలైనంతగా నేతలు, క్యాడర్ జనాల్లో చొచ్చుకుపోవాలన్నారు. స్ధానికంగా ఉండే సమస్యలపైన వాటి పరిష్కారాలపైన ఎక్కువగా దృష్టిపెట్టాలన్నారు. సమస్యలపై ఆందోళనలు, నిరసనలు చేయటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని చెప్పారు. సమస్యలపై ఆందోళనలను చేసినపుడు లోకల్ జనాలు కూడా కలిసొస్తారని, అప్పుడు వాటికి పరిష్కారం చూపించగలిగితే మన పార్టీపైన అందరికీ నమ్మకం వస్తుందని నాగబాబు చెప్పారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోను నేతలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీచేసుకుని పోరాటాలను మరింత ఉధృతంచేయాలని పిలుపిచ్చారు. మరి నాగబాబు పిలుపుతో నేతలు, క్యాడర్ ఏమేరకు జనాల్లోకి వెళతారో చూడాల్సిందే.