షర్మిల అయోమయంలో ఉన్నారా ?

తనపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలో వైఎస్ షర్మిలలో అయోమయం పెరిగిపోతోందా ? గ్రౌండ్ లెవల్లో పరిస్ధితులను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే షర్మిల పార్టీ విలీనం ఇపుడు అప్పుడు, ఈరోజు, రేపు అంటు ఆలస్యమవుతోంది. ఏదో కారణంగా విలీనం ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షర్మిలతో పాటు ఇతరుల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. మొన్నటి 16,17 తేదీల్లో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధిలు హైదరాబాద్ లోనే ఉన్నారు.

తుక్కుగూడలో బహిరంగసభ, సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగాయి. ఆ సమయంలోనే షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే విలీనం జరగలేదు. కారణం ఏమిటంటే షర్మిల అయోమయంలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏమిటంటే ఖమ్మంజిల్లాలోని పాలేరు అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వటంతో పాటు మరో ఐదుగురికి టికెట్లు కేటాయించాలని షర్మిల అడిగారట. అయితే అందుకు కాంగ్రెస్ అధిష్టానం కుదరదని చెప్పేసింది.

ఇదే సమయంలో కర్నాటక కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తామని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని పార్టీ అధిష్టానం ప్రతిపాదించిందట. ఈ ప్రతిపాదనను ఆమోదించాలో లేదో తేల్చుకోలేక షర్మిల బెంగుళూరు వెళ్ళినట్లు సమాచారం. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పార్టీ అధిష్టానం చెప్పినట్లే నడుచుకోవాలని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం హామీఇచ్చిన ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండదని షర్మిలకు డీకే చెప్పారట.

కాబట్టి విలీనం ప్రక్రియను తొందరలోనే ముగించుకోమని కూడా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవ్వటం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వటం అంటే షర్మిలకు చాలా పెద్ద హోదా దక్కినట్లే అని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనరల్ సెక్రటరీ హోదాలో రెండు మూడు రాష్ట్రాలకు ఇన్చార్జిగా నియమిస్తారని మంచి పనితీరు కనబరిస్తే మరింత ప్రాధాన్యత దక్కుతుందని కూడా అంటున్నారు. కాంగ్రెస్ తరపున మంచి ప్రతిపాదన వచ్చిందని మరి షర్మిల ఏమి ఆలోచించుకుంటారో చూడాలని అంటున్నారు. ఆలస్యం కాకుండా ఏదో ఒకటి తేల్చుకుంటే షర్మిలకే మంచిదని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.