కేసీఆర్ జగన్ వైపు… ఎమ్మెల్యేలు బాబు వైపా?

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అందుకు తీవ్ర కసరత్తుల్లో ఆయన మునిగిపోయారు. వరుసగా మూడో సారి కూడా జనాల ఆదరణను ఓట్ల రూపంలో మార్చేందుకు కేసీఆర్ ప్లాన్లు వేస్తున్నారు. ఓట్లు కోల్పోయేలా ఏ మాత్రం తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి. బాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకపోవడం కూడా ఇందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.

చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కొక్కరిగా బాబు అరెస్టును ఖండిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చెప్పకుండా, ఆయనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశమే లేదన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీని వల్ల కేసీఆర్ రెండు రకాలుగా ప్రయోజనం పొందాలని చూస్తున్నారని టాక్.

ఆంధ్ర సెటిలర్ల ఓట్లు చేజారకుండా జాగ్రత్తపడడం ఇందులో ఒకటి. అందుకే ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్లో బాబుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారని చెబుతున్నారు. అలాగే శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా బాబు అరెస్టుపై రియాక్టయ్యారు. దీంతో బాబు అరెస్టును బీఆర్ఎస్ ఖండించిందని ఆంధ్ర సెటిలర్లు ఆ పార్టీ వైపే మొగ్గు చూపే ఆస్కారముంది. మరోవైపు తెలంగాణ ద్రోహి అంటూ చంద్రబాబును కేసీఆర్, బీఆర్ఎస్ చెబుతుంది. ఇప్పుడు సడన్గా బాబుకు మద్దతుగా కేసీఆర్ మాట్లాడితే అది తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ సైలెంట్ గా ఉండి ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.