రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం వస్తుంది. రాజకీయ పార్టీల పొత్తు వ్యవహారం కూడా అంతే. ఇరు వర్గాలూ బేషజాలు లేకుండా కలిసి పని చేయాలి. పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరినొకరు నమ్మాలి. అవసరమైనపుడు అవతలి పార్టీని నిజాయితీగా పొగడాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నూటికి నూరు శాతం ఇలాగే చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పొత్తు ప్రకటించిన సమయంలోనే చంద్రబాబు విజన్‌ను, తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులను కొనియాడారు. అంతకుమించి విశేషం ఏంటంటే.. తన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సైతం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పొగుడుతూ.. ఆ పార్టీ, అందులోని నేతలను అందరూ గౌరవించాలని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం చేయడం.
పొత్తు విషయంలో కొందరికి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చని.. ఆత్మగౌరవం, అహం దెబ్బ తిన్నట్లుగా అనిపించవచ్చని.. కానీ అంతిమ లక్ష్యంగా వైసీపీని గద్దె దించడం కాబట్టి.. ఏమీ మనసులో పెట్టుకోకుండా టీడీపీతో కలిసి పని చేయాలని.. సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీని, దాని కోసం పని చేసే వారితో గొడవలు పడొద్దని, వారిని కించపరొచొద్దని పవన్ స్పష్టంగా జనసైనికులకు చెప్పేశాడు.
ఐతే పవన్ చేసిన పనిని టీడీపీ వాళ్లందరూ కొనియాడుతున్నారు. కానీ అంతటితో సరిపోదు. చంద్రబాబు సహా తెలుగు దేశం ముఖ్య నేతలంతా కూడా పవన్‌కు, ఆయన పార్టీకి, మద్దతుదారులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఇలాగే పవన్‌ను బహిరంగ వేదికల్లో పొగిడితే, గౌరవిస్తే జనసైనికుల్లో టీడీపీ పట్ల సానుకూల అభిప్రాయం కలుగుతుంది.
జనసైనికులకు.. టీడీపీ వాళ్లతో ఉన్న ప్రధాన అభ్యంతరం ఏంటంటే.. వాళ్లు తమ అధినేతను, పార్టీని గౌరవించరు, గుర్తించరు అని. ఐతే పవన్ చాలా ఉదారంగా వ్యవహరిస్తూ టీడీపీతో కలిసి పని చేయడానికి సిద్ధపడటమే కాక.. ఆ పార్టీకి ఎలివేషన్ ఇస్తున్నపుడు తమ పార్టీ, అధినేత నుంచి టీడీపీ కూడా అలాగే స్పందించాలని.. తమతో కలిసి పని చేయాలనుకున్నపుడు తమనకడె గౌరవించాలని కోరుకుంటారు. టీడీపీ వాళ్లు కూడా ఇంతే సిన్సియర్‌గా వ్యవహరిస్తే టీడీపీ, జనసేన పొత్తు సూపర్ హిట్ కావడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates