తెలుగుదేశం, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు ఎప్పుడో వచ్చేశాయి. పొత్తు అనివార్యం అన్నది అందరికీ తెలుసు. కాకపోతే ఎన్నికలు మరింత దగ్గర పడ్డాక.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పలు దఫాలు సమావేశమై.. సీట్ల పంపిణీలో ఒక అంచనాకు వచ్చి.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి పొత్తును ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా చంద్రబాబు జైల్లో ఉండగా.. బాలయ్య, లోకేష్‌లను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ పవన్ పొత్తు ప్రకటన చేశాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ముందే, హడావుడిగా పొత్తును ప్రకటించడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ.. పెద్ద నష్టమైతే లేదని, ఇంకా రెండు పార్టీలకు మేలే జరుగుతుందని భావిస్తున్నారు.
పొత్తు మీద త్వరగా ప్రకటన వచ్చేయడంతో ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలు మానసికంగా కలిసి పని చేయడానికి సిద్ధమై.. త్వరలోనే గ్రౌండ్ లెవెల్లో చేతులు కలుపుతారని భావిస్తున్నారు. కొన్ని రోజుల్లో ఇరు వర్గాల మధ్య సమన్వయం వస్తుందని… తద్వారా ఎన్నికల్లో ఇరు వైపులా ఓట్ల బదిలీకి మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. సీట్ల పంపిణీ విషయంలో కూడా త్వరగానే క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పొత్తును ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితులు కల్పించి.. టీడీపీ, జనసేనలకు జగన్ అండ్ కో మేలే చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయకపోయి ఉంటే.. పవన్ హడావుడిగా షూటింగ్స్ ఆపి ఏపీలో అడుగు పెట్టడం.. చంద్రబాబును జైల్లో పరామర్శించడం.. లోకేష్, బాలయ్యలతో చర్చించడం.. ఇంకెందుకు ఆలస్యం అని పొత్తును ప్రకటించడం జరిగేవి కావు. కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేయించడం ద్వారా తర్వాత ఎప్పుడో జరగాల్సిన పొత్తు ప్రకటనను జగన్ ఇప్పుడే చేయించి.. టీడీపీ, జనసేన ఇప్పట్నుంచే కలిసి పని చేసేలా జగనే చూశాడన్నది స్పష్టం. ఇది వైసీపీకే నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates