కీలక సమయంలో ఢిల్లీకి పవన్

ఈనెల 16వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అపాయిట్మెంట్ ఇస్తే అమిత్ షా తో భేటీ అవుతారు. లేకపోతే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, ఏపీ బీజేపీ ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ తో సమావేశమవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశ్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు అరెస్టు, టీడీపీతో పొత్తు విషయం ఫైనల్ చేసుకోవటమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఎప్పటినుండో బీజేపీ, టీడీపీ పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా బీజేపీ అగ్రనేతల నుండి ఎలాంటి సానుకూలత కనబడటంలేదు. ఈ విషయమై పవన్ చాలాసార్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అయితే గతంలో లాగ ఇపుడు పరిస్ధితులు లేవని ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నారట.

అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని బలంగా తన మనసులోని మాటను చెప్పాలని ఫిక్సయ్యారట. పైగా అరెస్టు తర్వాత చంద్రబాబుకు జనాల్లో బాగా సింపతి వచ్చేసిందని ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను కమలంపార్టీ పెద్దలకు వివరించి చెప్పాలని పవన్ అనుకుంటున్నారట. ఏ కారణం వల్లయినా బీజేపీ పెద్దలు టీడీపీతో కలిసే విషయమై ఆసక్తి చూపకపోతే తన భవిష్యత్తు ఏమిటో తాను స్పష్టంచేయటానికి కూడా పవన్ రెడీ అయినట్లు సమాచారం.

అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. బీజేపీని వదిలేస్తానని చెప్పలేదు కానీ టీడీపీతో పొత్తుంటుందని అనేక బహిరంగసభల్లో పవన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు జమిలి ఎన్నికలంటున్నారు, ముందస్తు ఎన్నికలంటున్న నేపధ్యంలో ఇప్పుడు కూడా ఏ విషయం నిర్ణయించుకోకపోతే తాను కూడా నష్టపోవటం ఖాయమని పవన్ డిసైడ్ అయ్యారట. అందుకనే తాడో పేడో తేల్చుకోవటానికే పవన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. మరి ఢిల్లీ పర్యటన ఏమవుతుందో చూడాల్సిందే.