న్యాయం కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు!

న్యాయం కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటున్నారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా. స్కిల్ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన వెంటనే లాయర్‌ లూథ్రా ఢిల్లీ నుంచి చంద్రబాబు వైపు ఆయన వాదనలు వినిపించడానికి ఏపీకి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఆయన వాదనలు వినిపించిన తరువాత బాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం అనేది కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటూ ఆయన పోస్ట్‌ చేశారు.

ఈ మాటలకు సంబంధించిన ఓ ఫోటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. అది ఏంటి అంటే ఉర్దూలో గురుగోవింద్ సింగ్ ప్రస్తావించిన మాటల చిత్రాన్ని ఆయన ఆ పోస్ట్‌ కు ట్యాగ్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ అవసరం లేదని ఆయన ఎంతగా వాదించినప్పటికీ బాబుకి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని కంటే ముందు ఆయన “ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసులో వాదించడం కోసం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో వేచి ఉన్నాను. ఈ న్యాయవాద వృత్తిలో ఎప్పుడూ నిస్తేజంగా ఉండకూడదు!” అని ట్వీట్ చేశారు.