టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో వాదోపవాదాల అనంతరం చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు వయసు, హోదా, భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు హౌస్ రిమాండ్ విధించాలంటూ వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం పై ఈ రోజు తీర్పు వెలువడే అవకాశముంది.
ఇదిలా ఉండగానే తాజాగా చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, గవర్నర్ అనుమతి లేకుండానే ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని దమ్మాలపాటి తన పిటిషన్ లో ప్రశ్నించారు. అంతేకాకుండా, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై కూడా దమ్మాలపాటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు
ఈ క్రమంలోనే ఆ లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ పిటిషన్ పై బుధవారం నాడు విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, దాదాపుగా రేపు చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని ఊహగానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లబిస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates