టీడీపీ నేతలకు మరోసారి నిరాశే ఎదురైంది. చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలనుకున్న టీడీపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అందుకు అనుమతించారు. కానీ తాజాగా ఆ అపాయింట్మెంట్ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడి కేసు విషయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడంతోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నిందితుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరించి బాబును అరెస్టు చేయించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా బాబుకు మద్దతుగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసే ముందు తన అనుమతి తీసుకోకపోవడంపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. బాబు అరెస్టు విషయం మీడియా ద్వారానే గవర్నర్కు తెలిసిందని రాజ్ భవన్ వర్గాలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు లాంటి నాయకుడిని అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని 2018లో చేసిన సవరణలో ఉందన్న చర్చ ఓ వైపు సాగుతోంది. మరోవైపు శనివారం గవర్నర్ను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. కానీ ముందస్తు అరెస్టుల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అది వీలు కాలేదు. దీంతో ఆదివారం ఉదయం కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కానీ ఇప్పుడేమో కేసు వాదనలు జరుగుతుండడంతో గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు చేశారని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates