న్యాయమూర్తితో చంద్రబాబు ఏం చెప్పారు?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు….న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. తన వాదనలు తానే వినిపించుకుంటానని చంద్రబాబు కోరగా..న్యాయమూర్తి దానికి అంగీకరించారు.

రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సిఐడి రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారని, తనపై కేసు నమోదు చేశారని, ఇది చట్ట విరుద్ధమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఆనాటి కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వం 2015 బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని కూడా పొందుపరిచామని, అది అసెంబ్లీ ఆమోదం పొందిందని గుర్తు చేశారు.

2021లో నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో తన పేరు, తన పాత్ర గురించి పేర్కొనలేదని చంద్రబాబు అన్నారు. వాదన తర్వాత మీరు కోర్లు హాల్లోనే ఉంటారా అని చంద్రబాబును న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో, అక్కడే ఉంటానని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసినా ఆయన సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.