స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, సీపీఐ రామకృష్ణ వంటి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని గంటా నివాసానికి దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో భారీ సంఖ్యలో పోలీసులు చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన తనయుడు రవితేజను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా తన అరెస్టును గంటా ఖండించారు. తన ఆనందం కోసం చంద్రబాబును, తనను జగన్ అరెస్టు చేయించారని, జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గద్దె దిగబోతోందన్న టెన్షన్ జగన్‌లో ఉందని, అందుకే తనను అరెస్టు చేశారని గంటా ఆరోపించారు. ఏ విచారణకైనా సిద్ధమని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని, దేశ రాజకీయాల్లో చంద్రబాబుది కీలక పాత్ర అని చెప్పారు. అటువంటి నేతను అరెస్టు అంటూ అర్థరాత్రి హైడ్రామా చేశారని ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్ళారని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయించి జైలుకు పంపుతున్నట్లు కనబడుతోందని ఆరోపించారు.
16 నెలలు జైల్లో ఉన్న జగన్..ఆయనలాగే అందరినీ జైలుకు పంపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనబడుతోందని దుయ్యబట్టారు. అందుకే, ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నాని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. అమరావతి భూముల విషయంలో మొదటిసారి తన పేరు కూడా చేర్చారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates