టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన చంద్రబాబు అరెస్ట్ హైడ్రామా శనివారం ఉదయం ముగిసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య, వాగ్వాదాల మధ్య చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసి అమరావతికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టును ఆయన తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడు లండన్ కి వెళ్ళాడని, మంచోడు జైలుకు వెళ్లాడని, ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అని లోకేష్ నిప్పులు చెరిగారు.
ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులకు కూడా తెలియదని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. పిచ్చోడి కళ్ళల్లో ఆనందం కోసమే ఈ అరెస్టు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు, చంద్రుడిపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు సైకో జగన్ అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. ఈ కేసులో తన తండ్రిని కలిసేందుకు అమరావతికి బయలుదేరిన లోకేష్ ను క్యాంపు సైట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడతాయని, ఎక్కడికి వెళ్ళవద్దని లోకేష్ తో పాటు టిడిపి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వారితో లోకేష్ వాగ్వాదానికి దిగారు.
తన తండ్రిని చూసేందుకు కూడా అనుమతించకపోవడం ఏమిటి అని పోలీసులు తీరుకు నిరసనగా క్యాంపు సైట్ వద్ద లోకేష్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మీ తండ్రిని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్లకుండా ఉంటారా అని పోలీసులను లోకేష్ ప్రశ్నించారు. ఇలా చేయడానికి సిగ్గు లేదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రిని అరెస్ట్ చేస్తుంటే రెస్ట్ తీసుకోమని ఎలా చెబుతారని పోలీసులపై లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ మండిపడ్డారు. తనను అడ్డుకోమని చెప్పిన అధికారి పేరు చెప్పాలంటూ క్యాంప్ సైట్ వద్దకు వచ్చిన పోలీసులను లోకేష్ నిలదీశారు. ఇలా చేయమని సైకో జగన్ చెప్పాడా అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఏం గొడవలు జరుగుతున్నాయని, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని లోకేష్ నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates