ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో మొదటి నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డిలతో పాటు సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ సిండికేట్ తరఫున ఆప్ మంత్రి సిసోడియాకు 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కవిత, మాగుంట ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి అప్రూవల్ గా మారడం సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్ గా మారడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. అప్రూవర్ గా మారిన శ్రీనివాసులు రెడ్డి…ఈడీ అధికారులకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పలు కీలక వివరాలను వెల్లడించారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్ గా మారి రాఘవరెడ్డితో పాటు బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ స్కాం కు సంబంధించిన పలువురిని ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. జి20 సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా ఈ కేసు విచారణను ఈడి వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో ఈ స్కామ్ కు సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల వ్యవహారం పై ఈడి ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిరోజులుగా హవాలా డీలింగ్స్ చేసే 20 మంది వ్యక్తులను ఈడి అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.
ఇక, ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును కూడా ఈడీ అధికారులు ఇటీవల మరోసారి ప్రశ్నించారట. త్వరలోనే తెలంగాణలోని పలువురు వ్యాపారవేత్తలను కూడా ఈడీ ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలను కుదిపేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.