జనసేన, వైసీపీ కోటల్లో… లోకేష్ ఎంట్రీ !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు రాయలసీమ నుంచి ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వ‌ర‌కు జోరుగా సాగింది. అనేక సామాజిక వ‌ర్గాలు, వివిధ వృత్తుల‌కు చెందిన వారు ముఖ్యంగా మ‌హిళ‌లు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వ‌ర్గాల వారు నారా లోకేష్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించారు. బాధ‌లు చెప్పుకొన్నారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ కూడా వారికి అనేక హామీలు గుప్పించారు.

క‌ట్ చేస్తే… ఆయా జిల్లాల్లో సాగిన పాద‌యాత్ర ఒక లెక్క అయితే, ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న పాద‌యాత్ర మ‌రో లెక్క అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఇప్పటి వ‌ర‌కు యువ‌గ‌ళం సాగిన జిల్లాల‌కు ఇక‌ నుంచి పాద‌యాత్ర సాగ‌నున్న తూర్పు గోదావ‌రి జిల్లాకు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అయినా… మ‌రో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరు(టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా కూడా)లో అయినా టీడీపీకి కేవ‌లం వైసీపీ మాత్ర‌మే ప్ర‌త్య‌ర్థిగా ఉంది.

ఆయా జిల్లాల్లోని ప్ర‌జ‌లు కూడా అటు వైసీపీ, లేదా ఇటు టీడీపీ అన్న‌ట్టుగా ఉన్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పాద‌యాత్ర‌లో పెద్ద‌గా మూడో పార్టీ ప్ర‌భావం అంటూ.. ఏమీ క‌నిపించ‌లేదు. అయితే.. ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లా విష‌యానికి వ‌స్తే మాత్రం ఇక్క‌డ చాలా ప్ర‌త్యేక‌మైన రాజ‌కీయ వాతావ‌ర ణం క‌నిపిస్తోంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల సామాజిక వ‌ర్గం కాపులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీవైపు ఉన్నారు.

అదేస‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్లు అధికార పార్టీ వైసీపీకి అను కూలంగా ఉన్నారు. ముఖ్యంగా కాపు యువ‌త అయితే.. జ‌న‌సేన వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపించి తూర్పులో జ‌న‌సేన‌కు ప‌ట్టం క‌ట్టాల‌నే ల‌క్ష్యంతో ఉన్నార‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నవాస్త‌వం. ఇక‌, ఎస్సీల ప‌రంగా చూసుకుంటే.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు స‌హా.. రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్య‌లో ఇక్క‌డ ఎస్సీల‌కు జ‌గ‌న‌న్న ఇంటి ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు.

ఈ నేప‌థ్యంలో తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల‌ను చూసుకుంటే.. ఇత‌ర జిల్లాల‌కు చాలా భిన్నంగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ పాద‌యాత్ర‌కు ఏమేర‌కు స్పంద‌న వ‌స్తుంద‌నేది ఒక స‌వాల్‌గా క‌నిపిస్తున్న అంశం. అదేస‌మ‌యంలో ఇక్క‌డి యువ‌త‌ను ప్ర‌ధానంగా త‌న‌వైపు తిప్పుకొనేందుకు నారా లోకేష్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది.

ఇక‌, టీడీపీ ప‌రంగా చూసుకుంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వాను త‌ట్టుకుని మ‌రీ తూర్పు గోదావ‌రి లోని రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను కైవసం చేసుకుంది. అదేవిధంగా ఓట్ల షేర్‌లోనూ బాగానే ఉంది. నిజానికి టీడీపీకి కంచుకోట వంటి బ‌ల‌మైన జిల్లా కూడా. అయితే.. అనూహ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని మ‌ళ్లీ ప‌రుగులు పెట్టించ‌డం, కీల‌క‌మైన అనుకూల ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకోవ‌డం వంటివి నారా లోకేష్‌కు ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా ఉన్నాయి.

అయితే.. ఈ మ‌ధ్య కాలంలో తూర్పులో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గం అంతా ఏకం కావ‌డం, జ‌న‌సేన వైపు మొగ్గు చూప‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో జ‌న‌సేన గ‌ళం వినిపించాల‌నే ల‌క్ష్యంతో ఇక్క‌డి యువ‌త ప్ర‌ధానంగా ఉండ‌డం, ప‌వ‌న్ నిర్వ‌హించిన అనేక స‌మావేశాలు, వారాహి యాత్ర‌లు సూప‌ర్ హిట్ కావ‌డం వంటివి ప‌రిశీలిస్తే… తూర్పు గోదావరి జిల్లా యూత్ జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, ఎస్సీ సామాజిక‌వర్గం వైసీపీకి అనుకూలంగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇక్క‌డ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందో.. యువ‌త‌ను ఎలా ఆక‌ర్షిస్తుందో వేచి చూడాలి.