ఏపీలోని వైసీపీ మంత్రివర్గంలో కొందరు వివాదాస్పద మంత్రులు ఉన్నారని ప్రతిపక్ష నాయకులు తరచుగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే.. మరికొందరు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒకరు. ఈయనపై పెద్దగా వివాదాలేమీ లేవు. పైగా ఉన్నత విద్యావంతుడు, మాజీ సివిల్ సర్వెంట్ కూడా. అయితే.. అనూహ్యంగా ఆదిమూలపు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేవరకు విషయం వెల్లడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
గురుపూజా దినోత్సవం నాడు… పలువురు టీచర్లను సన్మానించిన మంత్రి.. అనంతరం మాట్లాడుతూ… “గురువుల కన్నా గూగుల్ మిన్న” అని వ్యాఖ్యానించారు. గురువులకు తెలియని విషయాలు కూడా నేడు గూగుల్ చెబుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే రాజకీయంగా మంత్రిని ఏకాకిని చేశాయి. టీడీపీ సహా ఇతర పక్షాల నుంచి కూడా మంత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి ఆదిమూలపు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గూగుల్ మిన్న… గురువులు సున్నా… ఇదేమి సన్మానం మంత్రి గారు. గురుపూజోత్సవం రోజున గురువును పూచికపుల్లతో సమానంగా తీసి పడేశారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోండి. గూగుల్‌కు కంటెంట్‌ను అందించేది కూడా ఒక గురువు అనే సంగతి గమనించండి” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులు కూడా మంత్రి ఆదిమూలపు వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీచర్లకు క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. మంత్రిపై ప్రతిపక్ష నాయకులు ఈ రేంజ్‌లో దాడి చేస్తున్నా… తొటి వైసీపీ నాయకులు కానీ, ఇతర మంత్రులు కానీ స్పందించకపోవడం గమనార్హం.