తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్.. కేంద్రంలోని బీజేపీ కేంద్రంగా పదు నైన మాటలతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఉయదనిధిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా.. ఏకంగా ఆయన తలకు కోటి రూపాయల నజరానా ప్రకటించినా.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో బాంబు పేల్చారు. సనాతన ధర్మం అంటే… డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని 32 ఏళ్ల ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
తాజాగా.. ఉదయనిధి మరో బాంబు పేల్చారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకుండా తీవ్రంగా అవమానించిందని.. ఇది కుల వివక్షకు ఉత్తమ ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రపతిని ఇలా అవమానించడమే సనాతన ధర్మమా? అని కేంద్రంలోని మోడీ సర్కారును ఆయన నిలదీశారు. “నూతన పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ముని ఆహ్వానించలేదు. కుల వివక్షకు ఇంతకంటే మరో ఉత్తమ ఉదాహరణ లేదు” అని యువ స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఏకలవ్యుడు తక్కువ కులానికి చెందినవాడు కావడంతో.. ద్రోణాచార్యుడు అతనికి విలువిద్య పాఠాలు నేర్పించేందుకు నిరాకరించాడని వ్యాఖ్యానిస్తూ.. ఏకలవ్యుడు స్వతహాగా విలువిద్యను అభ్యసించి, ద్రోణాచార్యుని శిష్యుడైన అర్జునుడి కంటే నైపుణ్యం కలిగిన విలుకాడు అయ్యాడని గుర్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ద్రోణాచార్యుడు కోపాద్రిక్తుడై.. తన బొటనవేలుని కానుకగా ఇవ్వాలని ఏకలవ్యుడిని కోరాడన్నారు. రాష్ట్రపతి ముర్ము విషయంలోనూ కేంద్రం అలాగే వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.