మైనంపల్లి టెన్షన్ పెంచేస్తున్నారా ?

ఏ విషయం తేల్చకుండా మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు టెన్షన్ పెంచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీలో పోటీకి కేసీయార్ టికెట్ ప్రకటించారు. అయితే టికెట్ తీసుకోవటానికి హనుమంతరావు నిరాకరించారు. కారణం ఏమిటంటే మెదక్ లో తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ ఇస్తేనే మల్కాజ్ గిరిలో తాను పోటీచేస్తానని చెప్పారు. తండ్రి, కొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇవ్వటం కేసీయార్ కు ఇష్టంలేదు. అందుకనే మెదక్ లో కేసీయార్ టికెట్ ప్రకటించేశారు.

అప్పటినుండి ఇటు కేసీయార్ అటు మైనంపల్లికి మధ్య వివాదం పెరిగిపోతోంది. మైనంపల్లి టికెట్ తీసుకుంటే తీసుకున్నట్లు లేకపోతే ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని కేసీయార్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే ఏమిచేయాలో తనకూ తెలుసని మైనంపల్లి రివర్సులో మాట్లాడారు. దాంతో మైనంపల్లి ఏమి చేయబోతున్నారనేది బాగా ఆసక్తికరంగా తయారైంది. విజయవాడలోని కనకమ్మదుర్గమ్మను దర్శించుకుని వచ్చిన తర్వాత తన నిర్ణయం ఏమిటో చెబుతానని తాజాగా మైనంపల్లి ప్రకటించారు.

తాజా ప్రకటనతో పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎంఎల్ఏ మీద కేసీయార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనంపల్లి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందే అని సీనియర్లు చాలామంది కేసీయార్ పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కేసీయార్ ఎందుకు వెనకాడుతున్నారంటే ఎంఎల్ఏ ప్రభావం మరో మూడు నియోజకవర్గాలపై ఉంటుందట. మైనంపల్లి గనుక బీఆర్ఎస్ ను వదిలేస్తే ఏ పార్టీలో చేరుతారనేది కీలకమైంది.

ఎంఎల్ఏ గనుక కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బఖాయం. అదే బీజేపీలో చేరితే తగిలే దెబ్బ అంత తీవ్రంగా ఉండదని కేసీయార్ అంచనా. అందుకనే మైనంపల్లి ఏమిచేస్తారా అని కేసీయార్ వెయిట్ చేస్తున్నారు. కేసీయార్ వెయిట్ చేసే కొద్ది పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి కాంగ్రెస్ లో చేరినా ఎంఎల్ఏ కొడుక్కి టికెట్ ఇవ్వటం సాధ్యంకాదు. ఇద్దరికీ టికెట్లు కావాలంటే బహుశా అది బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుందేమో. మరి దుర్గమ్మ దర్శనం అయిన తర్వాత మైనంపల్లి ఏమి ప్రకటిస్తారో చూడాల్సిందే.