జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రప్రభుత్వం చేస్తున్న ఆలోచన కేసీయార్ ఆశలపై నీళ్ళు చల్లినట్లే అనుకుంటున్నారు. ఎలాగంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగితే తీరుబడిగా ఎలక్షనీరింగ్ చేసుకోవచ్చని అనుకున్నారు. అందుకనే మహారాష్ట్ర, ఏపీలో ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీకి దింపేందుక జోరుగా చర్చలు చేస్తున్నారు. ఏపీకన్నా మహారాష్ట్రపైన కేసీయార్ ఎక్కువగా దృష్టిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్రాలో చాలాసార్లు పర్యటించారు.
నాందేడ్, ఔరంగాబాద్ లాంటి జిల్లాల్లో రెగ్యులర్ గా క్యాంపులు వేస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం వచ్చేఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లే పార్టీపరంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల కమిటీల నియామకాలు, నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకాలు అన్నీ ఇందులో భాగమే. మహారాష్ట్ర విషయంలో ఇంత జోరుగా ఉన్న కేసీయార్ ఏపీ విషయంలో మాత్రం ఎందుకనో స్లోగా ఉన్నారు.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించి తర్వాత దృష్టంతా మహారాష్ట్ర మీద పెట్టాలని ఇదివరకే డిసైడ్ అయ్యారు. అలాంటిది ఇపుడు నరేంద్రమోడీ సడెన్ గా జమిలి ఎన్నికలంటే కేసీయార్ ప్లాన్లన్నీ చెల్లా చెదురైపోతాయి. తెలంగాణాలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేయటం కష్టమైపోతుందని అనుకుంటున్నారు. అభ్యర్ధులను ఎంపిక చేయటం కూడా కష్టమే అవుతుంది. ఇపుడు నియోజకవర్గాలకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధులను కూడా కొన్నిచోట్ల మార్చినా మార్చవచ్చు చెప్పలేం.
ఇలాంటి పరిస్ధితుల్లో ఏకకాలంలో తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, ఏపీలో కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో దృష్టిపెట్టాలంటే కేసీయార్ కు కష్టమే. అందుకనే మహారాష్ట్ర, ఏపీని వదిలేయకతప్పదు. అదే జరిగితే జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పాలన్న కేసీయార్ కోరిక తీరదు లేదా వాయిదాపడుతుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ నరేంద్రమోడీయే ప్రధానమంత్రి అయితే ఇక కేసీయార్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేదేమీ ఉండదు. జాతీయ రాజకీయాల్లో అప్పుడు చక్రమూ ఉండదు తప్పేదీ లేదు. అందుకనే జమిలి ఎన్నికలు కేసీయార్ ఆశలపై నీళ్ళు చల్లేస్తాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.