చావడానికైనా సిద్ధం..అయ్యన్న కామెంట్స్

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడును విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గన్నవరం సభలో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి పోలీసులు తమ వాహనంలో ఆయనను విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, హఠాత్తుగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద నేషనల్ హైవేపై ఆయనను పోలీసులు విడిచిపెట్టారు. అయ్యన్నకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం సంచలనం రేపుతోంది.

ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర అయ్యన్న ఉన్న హోటల్ వద్దకు చేరుకుని ఆయనను కలిశారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు నక్కపల్లి ప్రాంతంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై అయ్యన్న స్పందించారు. విశాఖ ఎయిర్ పోర్టుకు రాగానే హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. అయితే, విశాఖ నుంచి తాళ్లపాలెం వరకు తనని తీసుకువచ్చారని, ఆ సమయంలో పై అధికారుల నుంచి ఫోన్ రావడంతో 41 నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారని అన్నారు.

గన్నవరం సమావేశంలో మాట్లాడిన వ్యవహారంలో తనను అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారని అయ్యన్న అన్నారు. 10 రోజులలోపు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి తనను వదిలేశారని తెలిపారు. అయితే, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై పోరాటం చేస్తామని, పోలీసులు ఎప్పుడు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. కొడతారా కొట్టండి…చంపేస్తారా చంపేయండి… రాష్ట్రం కోసం చనిపోయేందుకు సిద్ధం…అంటూ అయ్యన్న షాకింగ్ కామెంట్స్ చేశారు.