వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన సస్పెన్సును పెంచేస్తోంది. కొంతకాలంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోతుందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లే షర్మిల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి స్పీడుగా జరుగుతున్న మంతనాలు మరోసారి నత్తను తలపిస్తున్నది. దాంతో విలీనం చర్యలు ఎందుకు స్పీడుగా జరుగుతున్నాయి, ఎందుకు స్లో అయిపోయిందో ఎవరు చెప్పలేకపోతున్నారు.
అసలు విలీనం ఉంటుందా ఉండదా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. గడచిన 15 రోజులుగా విలీనంపై ఎలాంటి అపడ్ డేట్లు లేవనే చెప్పాలి. అలాంటిడి సడెన్ గా షర్మిల భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే పార్టీలోని కీలకనేతలను తీసుకెళ్ళకుండా చివరకు గన్ మెన్లను కూడా హైదరాబాద్ లోనే వదిలేసి ఆమె భర్తతో పాటు ఢిల్లీకి వెళ్ళినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంత గోప్యంగా షర్మిల ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ? వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అన్నదే అర్ధంకావటంలేదు.
కాంగ్రెస్ అగ్రనేతల నుండి వచ్చిన కబురు కారణంగానే షర్మిల హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారనే ప్రచారం మొదలైంది. అన్నీ కుదిరితే గురువారమే పార్టీ అగ్రనేత సోనియాగాంధితో షర్మిల భేటీ జరిగే అవకాశముందని సమాచారం. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ కోసమే షర్మిల వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ భేటీలో కాంగ్రెస్ లో తన పాత్రపై షర్మిల క్లారిటి తెచ్చుకునే అవకాశముంది.
ఒకసారి క్లారిటి వచ్చేస్తే విలీనం అన్నది ఇక లాంఛనమే అని అందరికీ తెలుసు. కాకపోతే ఆ క్లారిటి అన్నది తెలంగాణాలో పోషించబోయే పాత్ర పైనేనా లేకపోతే ఏపికీ తరలి వెళ్ళే విషయంపైనా అన్నదే సస్పెన్సుగా మారింది. ఈ ఒక్క విషయంలోనే షర్మిల కూడా క్లారిటి కోరుకుంటున్నారు. షర్మిల ఆలోచన ప్రకారం తెలంగాణాలోనే ఉండాలనుంది. కాంగ్రెస్ ఏమో ఏపీలో బాధ్యతలు తీసుకుని బలోపేతం చేయాలని కోరుకుంటున్నది. మరి చివరకు ఏమి క్లారిటి వస్తుందో చూడాల్సిందే.