ఆ వైసీపీ ఎమ్మెల్యేకు గడ్డుకాలం!

ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి గడ్డు కాలం నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే ఆయనకు వ్యతిరేకంగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారంటూ ఏకంగా వైసీపీ అధిష్ఠానాకి ఆ పార్టీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

1999లో పలమనేరు నుంచి కాంగ్రెస్ తరపున తిప్పేస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి ఎమ్మెల్యేగా పోటో చేసి ఓడిపోయారు. కానీ ఆయనపై గెలిచిన టీడీపీ నాయకుడు ఈరన్నను అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని కోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో 2018లో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచారు.

2019లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో తిప్పేస్వామితో పాటు ఆయన కుటుంబ సభ్యుల మాటే చెల్లుబాటు అవుతోందన్న విమర్శలున్నాయి. దీన్ని సొంత పార్టీలోని అక్కడి నేతలు సహించలేకపోతున్నట్లు తెలిసింది. తిప్పేస్వామికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి, మరో నేత రవి శేఖర్ రెడ్డి మారారని టాక్. అంతే కాకుండా మాజీ మంత్రి నరసయ్య గౌడ్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివకుమార్ తదితర నేతలు కూడా తిప్పేస్వామిపై అసంత్రుప్తితో ఉన్నట్లు సమాచారం.

దీంతో ఎమ్మెల్యే అవినీతిపరుడంటూ తిప్పేస్వామిపై వీళ్లు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా వైసీపీ అధిష్ఠానికి కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తిప్పేస్వామికి టికెట్ ఇవ్వొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీళ్లు వినతి పత్రం కూడా సమర్పించారని టాక్. మరి సొంత పార్టీలోని అసంత్రుప్తిని తిప్పేస్వామి ఎలా తట్టుకుంటారో చూడాలి.