ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు గతంలో అధికార పార్టీని పలుమార్లు ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. తెలిసి అంటారో…తెలియక అంటారో తెలియదుగానీ…ధర్మాన మాత్రం స్వపక్షంలో విపక్షం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సొంత ప్రభుత్వంపై, పార్టీ నాయకత్వంపై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పార్టీ అధిష్టానంపై, పార్టీ నాయకత్వంపై వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని ధర్మాన అంగీకరించారు. ఇక, వైసీపీ నేతలు చెప్పిన వారికే వాలంటీర్ల పోస్టులు ఇచ్చామని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న సదుద్దేశ్యంతోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జగన్ ప్రవేశ పెట్టారని చెప్పుకొచ్చారు. దీంతో, తమ చేతిలో ఉన్న అధికారాలను కూడా తీసేశారన్న ఆవేదన, బాధ, కార్యకర్తల్లో ఉందన్నది వాస్తవమేనని ధర్మాన అంగీకరించారు. కానీ, కార్యకర్తలు ఇలాంటి అభిప్రాయంతో ఉంటే పార్టీపై ప్రజలలో తప్పుడు భావం ఏర్పడుతుందని, పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి హితవు పలికారు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు ధర్మాన సూచించారు.
శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే, ధర్మాన చేసిన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని, ఇదే అభిప్రాయం చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు, కార్యకర్తలలో సైతం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కాకపోతే ధర్మాన కాస్త ఓపెన్ గా బయటపడ్డారని, అందుకే ఆయనను తప్పుబట్టాల్సిన అవసరం లేదని నెటిజన్లు అంటున్నారు. ఎమ్మెల్యేల కన్నా వాలంటీర్ల మాట ఎక్కువ చెల్లుబాటవుతోందన్న భావన చాలా మంది వైసీపీ నేతలలో ఉందని, అందుకే వాలంటీర్లు వ్యవస్థ పై వైసీపీ నేతలు సైతం గుర్రుగా ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates