పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారా? పార్టీలో కొనసాగేలా ఆయనతో బేరసారాలు జరిపేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఊపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేసిన తుమ్మల తన బలాన్ని ప్రదర్శించి పార్టీ మారే సంకేతాలు పంపించారు.
దీంతో తుమ్మలను పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు కేసీఆర్ రంగంలో దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ దక్కని తుమ్మలను రాజ్యసభకు పంపించడంతో పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకునే బాధ్యతను ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు తుమ్మలతో రాయబారాలు చేస్తున్నారని టాక్. తుమ్మలతో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించినట్లు తెలిసింది. కె.కేశవరావును పొడిగించే అవకాశం లేదని, ఇక ఢిల్లీలో అధికారం తుమ్మలదే అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడక్కడ బీఆర్ఎస్కు చెప్పుకోదగ్గ లీడర్ అంటే పువ్వాడ అజయ్ మాత్రమే. కానీ ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నారని తెలిసింది. ఇప్పటికే ఖమ్మంలో బలహీనంగా ఉన్న బీఆర్ఎస్.. తుమ్మల వెళ్లిపోతే మరింత బలహీనంగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే రాయబారాలు జరుపుతున్నట్లు టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates