ఎమ్మెల్యే పదవి వద్దంటున్న కాంగ్రెస్ సీనియర్లు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అందరూ సీనియర్ నేతలే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అందరూ కీలక నాయకులే. అందుకే అధికారం, పదవి కోసం ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు ఎక్కువ అనే అభిప్రాయాలున్నాయి. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రయోజనాలు ఆశించి ఈ నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల దరఖాస్తు కోసం కాంగ్రెస్ విధించిన గడువు ఈ నెల 25తో ముగిసింది. 119 స్థానాలకు గాను 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిసింది. వీటిని వడబోసి చివరకు అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటిస్తుంది. కానీ కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ సారి దరఖాస్తు చేసుకోలేదు. వీ హనుమంతరావు, కొండా మురళి, జానారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుక చౌదరి తదితర సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ సీనియర్ నాయకుల్లో కొంతమందిని అధిష్ఠానం లోక్ సభ ఎన్నికల బరిలో దించుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు వీళ్లు దూరంగా ఉన్నారని టాక్. మరోవైపు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే అధిష్ఠానం నిబంధన కారణంగా కూడా కొంతమంది సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకోలేదని తెలిసింది. ఈ సారి సీనియర్ నాయకుడు జానారెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నాడు. కానీ ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాల గూడ నుంచి, చిన్నకొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.