రేసులో వెనుకబడ్డ బీజేపీ

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైందనే చెప్పాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ రాజేశారు. అంతే కాకుండా ముందుగానే నాలుగు మినహా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్, బీజేపీని మానసికంగా కేసీఆర్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికలకు తాము సిద్ధమని బీఆర్ఎస్ సంకేతాలు పంపించింది. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీనే.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ ముందుకు సాగుతున్నాయి. కానీ ఈ రెండు ప్రత్యర్థి పార్టీల్లో చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ ముందుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పాటు ఆ ప్రక్రియను పార్టీ మొదలెట్టింది. ఇప్పటికే దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ దక్కని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఖానాపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు ఉన్నారు. వీళ్లు తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యచరణ కోసం ఆలోచిస్తున్నారు. వీళ్లను కాంగ్రెస్లోకి లాగేందుకు రేవంత్ అండ్ టీమ్ పనిచేస్తోందని తెలిసింది. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అడుగు వేయడం లేదని అంటున్నారు. అభ్యర్థుల గురించి నివేదిక సమర్పించే బాధ్యతను ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు అప్పగించడం మినహా ఆ పార్టీది ఏం చప్పుడు లేదని టాక్.