రాజకీయ నీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తిరుగులేదనే పేరుంది. చాణక్య నీతితో ఎప్పుడు ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్నది కేసీఆర్కు బాగా తెలుసని చెబుతుంటారు. తాజాగా తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్రెడ్డిని కేసీఆర్ దారిలోకి తేవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తామనే ఆశ చూపి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా కేసీఆర్ చేశారని టాక్.
తాండూర్లో పట్నం మహేందర్రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య విభేదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. మహేందర్ రెడ్డి కారణంగానే 2018లో బీఆర్ఎస్ నుంచి రోహిత్ రెడ్డిని బహిష్కరించారని చెబుతుంటారు. కానీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రోహిత్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత రోహిత్ బీఆర్ఎస్లో చేరడం మహేందర్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకే టికెట్ ఇవ్వాలని మహేందర్రెడ్డి పట్టుబట్టారు. కాదని రోహిత్కు ఇస్తే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పారని తెలిసింది.
కానీ ఈ ఇద్దరి నేతలతో మాట్లాడిన కేసీఆర్ ఇద్దరికీ మేలు చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రోహిత్కు ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్రెడ్డి మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు తాండూరు నుంచి మళ్లీ రోహిత్కే టికెట్ కేటాయించారు. ఇక త్వరలోనే మహేందర్రెడ్డితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారని టాక్. ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో రోహిత్, మహేందర్ కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టికెట్ వచ్చిన తర్వాత మహేందర్ ఇంటికి రోహిత్ వెల్లడం, ఇద్దరు మిఠాయిలు తినిపించుకోవడం చూస్తుంటే కలిసిపోయారని అర్థమవుతోంది. .