టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో రికార్డుల మోత మోగిస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే.
యువగళం పాదయాత్ర 190 వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 16 కిలోమీటర్ల మేర సాగింది. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజామున 3:40 గంటల వరకు అంటే 12 గంటలకు పైగా నిర్విరామంగా 16 కిలో మీటర్ల పాటు పాదయాత్ర కొనసాగింది.
యాత్ర ప్రారంభించిన తర్వాత ఏకధాటిగా 12 గంటల పాటు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో నిన్న షెడ్యూల్ కంటే 8 గంటలు ఆలస్యంగా ముగిసింది. ఇప్పటి వరకూ 2,525 కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేసుకున్నారు.
లోకేష్ కు మద్దతుగా భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు, యువతీయువకులు సాదర స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజల ఆత్మీయ స్వాగతం లభించింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్ పాదయాత్రను నగరంలో కొనసాగించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates