రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు చేస్తోన్న ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రానికి నూతన రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశామని రైతులు వాపోతున్నారు. ఇపుడు ప్రభుత్వం మారిన వెంటనే మూడు రాజధానులంటూ విశాఖకు రాజధాని తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 6నెలలుగా వివిధ రూపాల్లో అమరావతి రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏపీ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు తలుపూ తట్టారు అమరావతి రైతులు. ఈ నేపథ్యంలో తాజాగా రైతుల తరఫున వాదించేందుకు దిగ్గజ న్యాయవాది పరాశరన్ ముందుకు వచ్చారు.
దశాబ్దాలపాటు నలిగిన అయోధ్య రామమందిరం కేసు వంటి ప్రతిష్టాత్మక కేసులను వాదించిన పరాశరన్….అమరావతి రైతులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు పరాశరన్ అంగీకరించారు. 2 రోజుల క్రితం రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన వాదనల్లోనూ పరాశరన్ పాల్గొన్నారు.
లాయర్ పరాశరన్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది అయోధ్య రామమందిరం కేసు. దశాబ్దాల పాటు ఈ కేసు కోసం సుప్రీంకోర్టులో పోరాడిన లాయర్ పరాశరన్ చాలామందికి సుపరిచితులే. తొమ్మిది పదులుదాటినా కూడా నిలుచొనే వాదించడం ఆయనకు న్యాయవాది వృత్తిపై ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. వయసు రీత్యా కూర్చుని వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా సున్నితంగా తిరస్కరించారు పరాశరన్.
అయోధ్య రామాలయ నిర్మాణ కల సాకారానికి విశేష కృషి చేసిన వారిలో ఒకరైన పరాశరన్…ఇపుడు అమరావతి రైతుల పక్షం నిలబడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్న అమరావతి రైతులకు అండగా ఉండబోతున్నారు. భారీ స్థాయిలో ఫీజు చెల్లించుకోలేని అమరావతి రైతులు…న్యాయం కోసం పోరాడే పరాశరన్ వంటి ప్రముఖ న్యాయవాదులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పరాశరన్ కేవలం ఒక్క రూపాయి ఫీజుకే అమరావతి రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు సిద్ధమయ్యారని రైతులు చెబుతున్నారు. పరాశరన్తో పాటు కొంత మంది లాయర్లు కూడా ఉచితంగా రాజధాని రైతుల కోసం వాదించేందుకు ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కూతురు కిరణ్ బాబ్డే కూడా అమరావతి రైతుల తరఫున ఇప్పటిే హైకోర్టులో వాదించారు. ఆమె కూడా అమరావతి రైతుల వైపునే ఉన్నారు. ఇలా, దిగ్గజ న్యాయవాదులు తమ పక్షాన నిలబడడంతో అమరావతి రైతులు తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates