ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకు అవసరమైతే పొత్తులకూ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీకి పొత్తు అవసరమే. ఇప్పటికీ ఇదే విషయం చెబుతూ బీజేపీతో కలిసి జనసేన సాగుతోంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు విషయంలో చాలా రోజులుగా ఏ విషయం తేలడం లేదు. కానీ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై బీజేపీ స్పందన బట్టి పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి బాబు తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారని తెలిసింది. ఇందులో ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నం కుట్రలు కూడా పేర్కొన్నారని సమాచారం. అందుకు సంబంధించి 70 పేజీలకు పైగా డాక్యుమెంట్లు, వీడియోలు ఆధారాలుగానూ సమర్పించారు.
ఈ లేఖపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించి ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు బీజేపీతో జత కట్టేందుకు బాబు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ లేఖను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతోనే బరిలో దిగితే ఏమైనా అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.