పోసానిపై కేసు.. లోకేష్ వాంగ్మూలం

యువ గళం పాదయాత్రతో జోరుమీదున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న, హింసిస్తున్న అధికారులు, పోలీసుల లెక్కలను అధికారంలోకి వచ్చాక తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా అలాంటి కేసు విషయంలోనే నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణముర‌ళి మీద వేసిన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు.

వైసీపీకి మద్దతుగా నిలిచే పోసాని టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్ష‌మాప‌ణ చెప్పాలని లోకేష్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై పోసాని స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు.

అబద్ధాలు చెబుతూ, నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోసానిపై కోర్టులో లోకేష్ కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగంగానే వాంగ్మూలాన్ని సమర్పించారు. పార్టీ జోలికి కానీ తమ జోలికి కానీ ఎవరైనా వస్తే విడిచి పెట్టేదే లేదంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.