టికెట్ల ఖరారు తేదీ దగ్గరకు వస్తున్నదనే ప్రచారం జరిగే కొద్దీ సిట్టింగ్ ఎంఎల్ఏలు, కొందరు ఎంపీలు, ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వాళ్ళంతా ముగ్గురిపైన బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత. మంత్రులతో పాటు చాలా మందికి కేసీయార్ దర్శనభాగ్యం దొరకడం లేదు. టికెట్లు ఫైనల్ చేయటంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్ లో బిజీగా ఉన్నారు.
సో కేసీయార్ ను కలిసి మాట్లాడలేని వాళ్ళంతా అందుబాటులో ఉండే కేటీయార్, హరీష్, కవితలను కలుస్తున్నారు. పైగా చాలామంది పై ముగ్గురు మద్దతుదారులుగా ముద్రపడినవారే ఉన్నారు. అందుకనే టికెట్ల కోసం అందులోను మొదటిజాబితాలోనే తమ పేరుండేట్లుగా చూడాలని చాలామంది సిట్టింగులు పై ముగ్గురిపై ఒత్తిడి పెంచేస్తున్నారట. బొంతు రామ్మోహన్, క్రిశాంక్, శంభీపూర్ రాజా, కేపీ వివేకానందగౌడ్, బాల్కసుమన్, శ్రీధరరెడ్డి, మర్రిజనార్ధనరెడ్డి లాంటి వాళ్ళు మొదటి జాబితాలోనే తమ పేర్లుండాలనేట్లుగా కేటీయార్ మీద ప్రెషన్ పెంచేస్తున్నారట.
ఇక హరీష్ రావుకు కూడా తన మద్దతుదారుల నుండి ఇదే సమస్య పెరిగిపోతోంది. అనేక జిల్లాల్లో నేతల మధ్య సమస్యలు వచ్చినపుడల్లా కేసీయార్ మేనల్లుడు, మంత్రయిన హరీష్ నే ట్రబుల్ షూటర్ గా పంపారు. దాంతో చాలా జిల్లాల్లో హరీష్ మద్దతుదారులుగా చెలామణి అవుతున్నారు. ఎర్రోళ్ళ శ్రీనివాస్, పద్మాదేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, కొత్తా ప్రభాకరరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి లాంటి చాలామంది మొదటిజాబితాలో పేర్ల కోసం హరీష్ పైనే ఆశలు పెట్టుకున్నారట.
ఇక కవిత మద్దతుదారులుగా కొందరు నిజామాబాద్ జిల్లాలో చెలామణి అవుతున్నారు. వీళ్ళసంఖ్య తక్కువే అయినా గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకని కవిత కూడా ఏమి చెప్పలేక నానా అవస్తలు పడుతున్నారు. ఇక్కడ పై ముగ్గురికీ సమస్య ఏమిటంటే మొదటిజాబితా పేరుతో ఒక్క పేరు కూడా లీక్ కాలేదు. అంటే కేసీయార్ ఎంతజాగ్రత్తగా జాబితాలను రెడీ చేస్తున్నారనే విషయం అర్ధమవుతోంది. 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా మొదటిజాబితా రిలీజవుతుందన్న ప్రచారమే అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది.