ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి మ‌రీ వార్నింగ్‌?

ఈ ఏడాది చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కుతోంది. ప‌రిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం బీఆర్ఎస్‌.. అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మూడో సారి సీఎం పీఠంపై కూర్చునేందుకు కేసీఆర్ ప్ర‌ణాళిక‌ల్లో నిమ‌గ్నమ‌య్యార‌ని తెలిసింది.

ఈ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌కు.. కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డ్డాయ‌ని టాక్‌. అందులో ముఖ్యంగా కొంత‌మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై సొంత పార్టీ నేత‌ల్లో అసంతృప్తి, ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందని తెలిసింది. ఇప్ప‌టికే వివిధ స‌ర్వేల ద్వారా ఎమ్మెల్యేల ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో వీళ్ల‌కున్న అభిప్రాయాల‌ను కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ విష‌యంపై కొంత‌మంది ఎమ్మెల్యేల‌నూ ప‌నితీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. కానీ ఎలాంటి మార్పు లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర‌మైన హెచ్చ‌రిక జారీ చేస్తున్న‌ట్లు తెలిసింది.

ఎన్నిక‌లకు ముందున్న ఈ స‌మ‌యం ఎంతో కీల‌క‌మైంద‌ని, ఎమ్మెల్యేలంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేసీఆర్ చెబుతున్నార‌ని స‌మాచారం. గ్రాఫ్ స‌రిగ్గా లేని ఎమ్మెల్యేల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించుకుని మ‌రీ కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్న‌ట్లు తెలిసింది. నియోజ‌క‌వ‌ర్గంలో ఇచ్చిన హామీలు అమ‌లయ్యాయా? ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉంటున్నారా? త‌దిత‌ర విష‌యాల‌పై కేసీఆర్ ఆరా తీస్తున్నార‌ని అంటున్నారు. స‌ర్వే ఫ‌లితాల‌ను ముందేసుకుని ఒక్కో ఎమ్మెల్యేకు క్లాస్ పీకుతున్న‌ట్లు తెలిసింది.  మార్పు రాక‌పోతే టికెట్ ఇచ్చేది లేద‌ని కేసీఆర్ తెగేసి చెబుతున్నార‌ని టాక్‌.