ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉండదా? ఈ రెండు పార్టీలు వేర్వేరుగానే ఎన్నికల బరిలో దిగుతాయా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలే అందుకు కారణంగా కనిపిస్తోంది. వారాహి యాత్రతో పుల్ జోష్‌లో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీని కూడా పవన్ కలుపుకుంటారని ఇన్ని రోజులూ తెగ ప్రచారం సాగింది.
ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తుంటే టీడీపీతో పవన్ జతకట్టే ఉద్దేశం లేదని తెలిసింది. ఇప్పటివరకూ పొత్తుపై ఈ రెండు పార్టీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతే కాకుండా ఇటీవల ఈ పార్టీల మధ్య దూరం పెరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులనూ వీళ్లు వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. ఇటీవల టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ.. జనసేనలో చేరడం హాట్‌టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా గణపతి పురం నుంచి ఆమె మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరుణ.. జనసేనలో చేరడం టీడీపీకి దెబ్బేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టీడీపీలోని మరికొంత మంది అసంతృప్త నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో టీడీపీ నుంచి జనసేనలోకి వలసలు ఉండడం ఖాయమని అంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు వద్దే వద్దని బీజేపీ చెబుతోంది. ఇటీవల బీజేపీ, జనసేన కలిసి ధర్నాల్లో పాల్గొనుండడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బీజేపీ, జనసేన పొత్తులోకి టీడీపీ వచ్చే అవకాశమే లేదన్నది విశ్లేషకుల మాట.