తెలంగాణ కాంగ్రెస్‌.. జుట్టు వాళ్ల చేతిలో!

తెలంగాణ ఎన్నిక‌ల్లో సానుకూల ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కంతో ఉన్న కాంగ్రెస్‌.. అందుకు త‌గ్గ‌ట్లుగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన అధిష్ఠానం.. ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు పార్టీని స‌న్న‌ద్ధం చేసే బాధ్య‌త‌ల‌ను అగ్ర నేత‌ల‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు తెలిసింది. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన ప్ర‌చారం, అమ‌లు చేయాల్సిన వ్యూహాల బాధ్య‌త‌ల‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌ల‌కు అధిష్ఠానం అప్ప‌గించిన‌ట్లు టాక్‌.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జీ, ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు త‌మ ప‌ని తాము చేస్తున్నారు. ఇప్పుడు బ‌య‌ట నుంచి మ‌రో ఇద్ద‌రు అగ్ర నేత‌ల‌ను తెలంగాణ కోసం కాంగ్రెస్ బరిలో దింపుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు లోటు లేదు. ఇక్క‌డ పార్టీలో అంద‌రూ  కీల‌క నాయ‌కులే. వీళ్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అందుకే తెలంగాణ‌లో పార్టీని గాడిన పెట్టి ఎన్నిక‌లకు సిద్ధం చేసేందుకు ప్రియాంక గాంధీ, డీకే శివ‌కుమార్‌ల‌ను కాంగ్రెస్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని తెలిసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల జ‌ట్టు.. ఈ ఇద్ద‌రి చేతుల్లోకి వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్ని నాట‌కాలు ఆడినా ఎలాంటి తేడా రాలేద‌ని, కానీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తోక జాడిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అధిష్ఠానం సూచ‌న ప్రాయంగా చెప్పిందని స‌మాచారం. ప్రియాంక ఎప్ప‌టి నుంచో పార్టీలో కీల‌క నాయ‌కురాలిగా కొన‌సాగుతున్నారు. ఇక ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలో తేవ‌డంతో శివ‌కుమార్‌ది కీల‌క పాత్ర‌. మ‌రి ఈ ఇద్ద‌రు క‌లిసి తెలంగాణ‌లో ఎలాంటి మాయ చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.