విశాఖలోని జగదాంబ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పవన్ రుషికొండ పర్యటనపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.
జోడిగుడ్లపాలెం నుంచి ఎవరిని అనుమతించమని, రాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు. రుషికొండపైకి వెళ్లకుండా గోడ దగ్గర నుంచి మాత్రమే చూడాలని నిబంధనలు పెట్టారు. గీతం యూనివర్సిటీ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నేపద్యంలోనే పోలీసుల ఆంక్షల మధ్య ఉద్రిక్త వాతావరణం నడుమ పవన్ కళ్యాణ్ రుషికొండను సందర్శించారు.
రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతొ, బారికేడ్ దూకి మరీ రుషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పరిశీలించారు. రోడ్డుపై నుంచి చూడాలని చెప్పడంతో అక్కడి నుంచే కొండ తవ్వకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. నిబంధనలు పాటించాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. విపక్షాలు చిన్న నిరసన చేపట్టినా అరెస్టు చేస్తారని, జగన్ మాత్రం కొండను తవ్వినా ఏం కాదని విమర్శించారు. తెలంగాణలో ఇలాగే దోపిడీ చేస్తే తన్ని తరిమేశారు అని అన్నారు.
సీఎం కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా, ఓ మూలన కూర్చోలేడా ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి ఇక్కడ రుషికొండ మీద అవసరమా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను దోపిడీ చేయాలని వైసిపి నేతలు చూస్తున్నారని, ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని మీడియా కూడా ప్రశ్నించి ప్రజలకు చేరవేయాలని అన్నారు. ఇప్పటివరకు ఒక్క రాజధానికే దిక్కు లేదని పవన్ ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates