ఆ 42 స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్‌కు ఛాన్స్‌!

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను ఓడించి, అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆ పార్టీకి సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌కు గ‌ట్టి పోటీనిచ్చేది కాంగ్రెస్ మాత్ర‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ విజ‌యం అంత సుల‌భం కాద‌న్నది మాత్రం వాస్త‌వం. అందుకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన సీట్లు గెల‌వ‌డంపై కాంగ్రెస్ దృష్టి సారించింది.

తెలంగాణ‌లో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 60 సీట్లు రావాలి. కాంగ్రెస్ ముందుగా ఈ మ్యాజిక్ ఫిగ‌ర్ అందుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోల్ స‌మ‌ర్పించిన నివేదిక మాత్రం పార్టీ నేత‌ల‌కు షాక్ క‌లిగిస్తోంద‌ని తెలిసింది. ఈ నివేదిక ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌చ్చితంగా 41 స్థానాల్లో గెలుస్తుంద‌ని తేలింది. ఈ 41 స్థానాల‌ను ఏ కేట‌గిరీగా విభ‌జించారు. ఇక క‌ష్ట‌ప‌డితే గెలిచే 42 స్థానాల‌ను బి కేట‌గిరీలో పెట్టారు. ఎక్కువ శ్ర‌మ‌ప‌డాల్సిన 36 స్థానాల‌ను సి కేట‌గిరీలో పెట్టారు.

సునీల్ క‌నుగోల్ నివేదిక ప్ర‌కారం కాంగ్రెస్ 41 స్థానాల్లో క‌చ్చితంగా గెలుస్తుంద‌ని అంచ‌నా వేశారు. దీంతో అధికారం ద‌క్కాంలంటే ఆ పార్టీ మ‌రో 19 స్థానాల్లో గెలిస్తే చాల‌న్న మాట‌. కానీ సీట్లు త‌క్కువ వ‌చ్చినా ఎంఐఎం లాంటి ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అందుకే క‌ష్ట‌ప‌డితే గెలిచే ఛాన్స్ ఉన్న 42 స్థానాల‌పైనా కాంగ్రెస్ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలిసిందే. ఈ స్థానాల్లోనూ ప్ర‌చారాన్ని హోరెత్తించి, ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చూర‌గొనాల‌నేది కాంగ్రెస్ వ్యూహంగా తెలిసింది.