కేటీఆర్ నోట‌.. గెలుపోట‌ముల మాట‌

కేటీఆర్‌.. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా కేసీఆర్ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు. వ‌రుస‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి చ‌రిష్మా ఉన్న కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం సులువేన‌న్న అభిప్రాయాలున్నాయి. కానీ తాజాగా ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది బీఆర్ఎస్ అని.. కేంద్రంలోనూ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డి, అందులో త‌మ పార్టీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఇటీవ‌ల కేటీఆర్ చెబుతున్నారు. పార్టీ విజ‌యంపై అంత ధీమాతో ఉన్న ఆయ‌న‌.. తాజాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ద‌య ఉంటే గెలుస్తాన‌ని, లేకుంటే ఇంట్లో కూర్చుంటాన‌ని ఆయ‌న అన్నారు.

పార్టీలో కీల‌క నేత అయిన కేటీఆర్‌కు తిరుగులేద‌ని అంటుంటారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న కంచుకోట అని చెబుతారు. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల‌పై కేటీఆర్ వ్యాఖ్య‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల ఓ స‌ర్వే ప్ర‌కారం సిరిసిల్లాలో కేటీఆర్ గెలుస్తారు కానీ మెజారిటీ మాత్రం త‌గ్గుతుంద‌ని వెల్ల‌డైంద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ చూర‌గొనేందుకు కేటీఆర్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారా? అన్న అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.