తమ్ముడికి జ్ఞానబోధ చెయ్యండి చిరంజీవి గారు

ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేయాలని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై విమర్శలు చేయడం మానుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ లోని వైసీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలితోపాటు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స, ఎంపీ నందిగం సురేష్ తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి జ్ఞానబోధ చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని, కానీ సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దు అన్నట్టుగా చిరంజీవి మాట్లాడారని  అన్నారు. అయితే, ఆ గొడవ మొదలుబెట్టింది పవన్ అని చిరంజీవి తెలుసుకోవాలని గుర్తు చేశారు. దాడికి ప్రతిదాడి చేస్తే బాధపడుతున్నారని విమర్శించారు. బ్రో సినిమాలో అంబటి పాత్రను సృష్టించింది ఎవరని? ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. సినిమాలను పిచ్చుక అంటూ ఇండస్ట్రీని తక్కువ చేయడం ఏంటని అమర్నాథ్ ప్రశ్నించారు.

తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని చిరంజీవికి అంబటి రాంబాబు సూచించారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారా లేదా చిరంజీవి చెప్పాలని నిలదీశారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని ఆయన ఏం మాట్లాడారో చూసి రేపు మళ్లీ మాట్లాడుతానని అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా స్పందించారు. ఈ గొడవను మొదలుపెట్టింది మీ తమ్ముడు అని, బురద రాజకీయాలు మానుకోవాలని తమ్ముడికి హితవు చెప్పాలని సురేష్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా తేవాలో తాము చూసుకుంటామని చెప్పారు. సినిమా పరిశ్రమను పిచ్చుక అంటూ చిరంజీవి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదని బొత్స అన్నారు. చిరంజీవి ఆ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.