జేసీల‌ను చంద్ర‌బాబుకు దూరం చేసింది అదేనా..!


కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మే అవుతాయి. త‌మ వ్యూహాల‌తో ఏదో సాధించాలని అనుకున్నా.. అది సాధించ‌లేక పోతారు కూడా. ఇప్పుడు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్‌కు..టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. పైకి లేద‌ని అన్నా.. ఇది వాస్త‌వం. 2014లో టీడీపీలో చేరిన జేసీల‌కు చంద్ర‌బాబు ఏం కావాల‌న్నా.. చేశారు. వారు కోరిన‌వ‌న్నీ ఇచ్చారు.

2014లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు అడిగారు. చంద్ర‌బాబు కాద‌న‌కుండా ఇచ్చారు. 2019లో వ‌ద్దు.. ఎన్నిక‌లు సీరియ‌స్‌గా ఉన్నాయి. మీరే పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. జేసీలు ప‌ట్టుబ‌ట్టి త‌మ వారసుల‌కే టికెట్లు ఇవ్వాల‌న్నారు. కాద‌న‌కుండానే చంద్ర‌బాబు వారికి ఆ ప‌ని కూడా చేశారు. ఇక‌, 2018-19 మ‌ధ్య కాలంలో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ..జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అప్పుడు అసెంబ్లీ జ‌రుగుతోంది. దీంతో ఉలిక్కిప‌డిన చంద్ర‌బాబు హుటాహుటిన మంత్రి దేవినేని ఉమాను అనంత‌పురానికి పంపించి.. ఆయ‌న మ‌న‌సులో మాట క‌నుక్కున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ట్టిసీమ నుంచి తాడిప‌త్రికి నీటిని పంపించారు. ఇలా.. జేసీలు ఏది కోరుకున్నా చేశారు. మ‌రి అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. దీనికి కార‌ణం ఎవ‌రు? ఎందుకు? అంటే.. అంద‌రి వేళ్లూ జేసీల‌వైపే చూపిస్తున్నారు.

గ‌త నాలుగేళ్ల‌లో ఏ ఒక్క కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేదు. పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు క‌నీసం మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు. వ్య‌క్తిగ‌త వివాదాలు.. ర‌గ‌డ‌ల‌తోనే పొద్దు పుచ్చారు. అయినా.. చంద్ర‌బాబు ఏమీ అన‌లేదు. ఇక‌, కీల‌క‌మైన పుట్ట‌ప‌ర్తిలో పార్టీకి న‌మ్మ‌కంగా సేవ చేస్తున్న మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డిపై జేసీలు దండ‌యాత్ర చేయ‌డం.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డాన్ని మాత్రం చంద్ర‌బాబు స‌హించ‌లేక‌పోయారు.

అదేవిధంగా అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌భాక‌ర్ చౌద‌రికి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పారు. ఈ ప‌రిణామాల తో విసిగిపోయిన చంద్ర‌బాబు.. వారిని దూరం పెట్టారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేపథ్యంలో జేసీలు మ‌ళ్లీ చంద్ర‌బాబును క‌లుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా..వారిని పోగొట్టుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జేసీల విష‌యంపై ఏదో ఒక‌టి తేల్చాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఏం చేస్తారో చూడాలి.