బీజేపీ ఎమ్మెల్యే, బలమైన నేత రాజాసింగ్.. రాజకీయాలకు దూరమవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కష్టమేనా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా అసెంబ్లీలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని చెబుతున్నారు. తానైతే మళ్లీ సభలో ఉండను అని స్వయంగా రాజా సింగ్ చెప్పడం చర్చకు దారి తీసింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ”ఇప్పుడు సభలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు వచ్చేసారి శాసన సభలోకి రావొచ్చు. రాకపోవచ్చు. నేనైతే మళ్లీ ఈ సభలో ఉండను. అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టకుండా నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి” అని భావోద్వేగంతో పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ధూల్‌పేట్‌లో లోధి ప్రజలకు ప్రభుత్వం తోడుగా ఉండాలని ఆయన కోరారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక ఏదో దాగి ఉందనే చర్చ మొదలైంది.
2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచారు. 2018లో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. కానీ ఇటీవల హింసను ప్రేరేపించేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. మరోవైపు బీజేపీ అధిష్ఠానం ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా గోషామహల్ నియోజకవర్గానికి ఆయన్ని దూరం చేసేలా పార్టీ ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఇంటా, బయట తనపై కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఇప్పటికే చెప్పారు. గోషామహల్ నియోజకవర్గాన్ని వదులకోవాల్సి వస్తే రాజకీయాలకు దూరమవుతానని కూడా అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates