టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖబడ్దార్! అంటూ ఆయన హెచ్చరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పటికే 60 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే.. 100 మందికిపైగా కార్యకర్తల జాడ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు వద్దకు ఈ రోజు ఉదయం వచ్చిన చిత్తూరు నాయకులు.. జిల్లాలో జరుగుతున్న కేసుల నమోదు.. నాయకులు, కార్యకర్తల నిర్బంధంపై చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల ఆవేదన విని చలించిపోయిన చంద్రబాబు పోలీసులను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.
పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అనర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నారని అర్థం చేసుకోవాలన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామన్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడతారా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. పోలీసులు పద్ధతి మార్చుకుని, రాజ్యాంగం ప్రకారం.. చట్టం ప్రకారం వ్యవహరించాలని అన్నారు.
కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.