కాంగ్రెస్‌లో ఆ ఒక్క‌రు ఎవ‌రు?

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే దిశ‌గా రాబోయే రెండు నెల‌లు కీల‌క‌మ‌ని, విభేదాలు ప‌క్క‌న‌పెట్టి నేత‌లంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ మార్గ‌నిర్దేశ‌నం చేశారు. వ‌చ్చే 100 రోజులు అత్యంత కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలోని ముఖ్య నేత‌ల మ‌ధ్య విభేదాల‌పైనా మాట్లాడారు. 2018 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో గెల‌వాల్సింద‌ని, కానీ నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని వేణుగోపాల్ అన్న‌ట్లు తెలిసింది.

ఈ సారి అధికారంలో వ‌స్తే సీఎం అయ్యేది ఇక్క‌డి కీల‌క నేత‌ల్లో ఒక‌రేన‌ని వేణుగోపాల్ పేర్కొన్నారు. అందుకే పార్టీ కోసం క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఆ సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌లో దాదాపు అంద‌రూ సీనియ‌ర్ నాయ‌కులే. కీల‌క నేత‌లే. సీఎం ప‌ద‌వి ఆశించేవాళ్లే. ఇటు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నుంచి అటు వీహెచ్ హ‌నుమంత‌రావు వ‌ర‌కూ సీఎం ప‌ద‌విపై ఆశ‌తో ఉన్న‌వాళ్లే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రేవంత్‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి, సీత‌క్క‌.. ఇలా చెప్పుకుంటూ పోతే కీల‌క నేత‌ల జాబితా పెద్ద‌దే. వీళ్ల‌లో చాలా మందికి అధికారం కావాలి.. కానీ పార్టీ కోసం మాత్రం ప‌నిచేయార‌నే అభిప్రాయాలున్నాయి. పార్టీ అధిష్ఠానం ఎన్నిసార్లు హెచ్చ‌రించినా కొంత‌మంది నాయ‌కుల వైఖ‌రిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేద‌ని తెలిసింది. నాయ‌కులు క‌లిసి ప‌నిచేయాల‌ని చెప్పిన వేణుగోపాల్ ముందే.. రేవంత్‌, ఉత్త‌మ్ వాగ్వాదానికి దిగార‌ని తెలిసింది. దీన్ని బ‌ట్టే పార్టీలో ప‌రిస్థితి ఎలా ఉందో స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఈ నాయ‌కులు క‌లిసి పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తారా? అంటే క‌చ్చితంగా అవున‌ని చెప్పే ప‌రిస్థితులు లేవ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.