నువ్వు ఎవడ్రా పుడింగి? పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్

అన్నమయ్య జిల్లాలోని అంగళ్లు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీకాళహస్తిలో జరగబోయే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే, అన్ని అడ్డంకులను అధిగమించి శ్రీకాళహస్తికి చేరుకున్న చంద్రబాబు అక్కడ రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను పుంగనూరు మీదుగా వెళ్ళకూడదు అని చెప్పడానికి నువ్వు ఎవడ్రా పుడింగి అంటూ చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏం తమాషాగా ఉందా? ఏమనుకుంటున్నావు? అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంగళ్ళులో తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే టీడీపీ కార్యకర్తలు దీటుగా అడ్డుకున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చంద్రబాబు ఆరోపించారు. పుంగనూరు మీదుగా పూతలపట్టు వెళ్లాలనుకున్నానని, కానీ, తనను వెళ్లనివ్వకుండా అడ్డుకొని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.

దాడులు చేసేందుకే వైసీపీ వాళ్ళు వచ్చారని, వారిని పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఈరోజు శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా సభ జరుగుతోందని, ఇక్కడికి వైసీపీ దొంగలు రాలేదు కాబట్టే సభ సజావుగా సాగుతోందని చంద్రబాబు అన్నారు. మన మీద దాడికి వస్తే తిరగబడతామని, వాళ్ళు కర్ర తీసుకుని వస్తే తాను కూడా కర్ర తీసుకొని వస్తానని చంద్రబాబు అన్నారు. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొడతానని, వివేకా మాదిరి గొడ్డలితో నరికితే చనిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు పెడితే కలెక్టర్లు, ఎస్పీలు తొలగిస్తున్నారని ఆరోపించారు.

నిన్న జరిగిన ఘటనల పట్ల సిగ్గులేకుండా వైసీపీ నాయకులు బంద్ కు పిలుపునిచ్చారని మండిపడ్డారు. తాను బైపాస్ రోడ్డు వరకు వచ్చానని, పుంగనూరుకి వెళ్లానో లేదో చూశారా అని డీఐజీని ప్రశ్నించారు. నేను పుంగనూరులోకి వెళ్లకపోతే దాడులు జరిగేవి కాదని డిఐజి చెప్తున్నారని, లేకపోతే భద్రత కల్పించేవాళ్లమని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేక నన్ను కూడా గొడ్డలిపోటుతో లేపేయాలనుకుంటున్నారా అని నిప్పులు చెరిగారు. నన్ను లేపేయడం మీ వల్ల కాదని, టీడీపీ కార్యకర్తలు నాకు శ్రీరామరక్ష అని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.