ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు నిర్ణీత లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో లక్ష్యాల స్థాయి మారుతున్న విషయం కొంత నిశితంగా గమనిస్తే తప్ప అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు ప్రజలను మచ్చిక చేసుకుని.. చంద్రబాబు విజన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా విజయం దక్కించు కోవాలని భావించింది.
అయితే.. అనూహ్య కారణాలు.. పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసుకున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. ఈ వ్యూహాన్ని కొంత మార్చుకుని.. మరింత జోరు పెంచారు. వైసీపీకి దన్నుగా ఉన్న జిల్లాల్లో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఈ సారి భారీ విజయం నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక వేళ భారీ కాకపోయినా.. వైసీపీ స్థాయిని తగ్గించేలా అయినా.. పుంజుకోవాలన్నది టీడీపీ లక్ష్యం.
ఈ క్రమంలో ప్రాంతాల వారీగా చూసుకుంటే.. సీమ ఇప్పుడు వైసీపీకి అన్నివిధాలా అందివచ్చే అవకాశం ఉన్న ప్రాంతంగా టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ హవా ఎక్కువగా ఉన్నా.. టీడీపీకి మార్కులు బాగానే పడ్డాయి. ఎంపీ సహా పలువురు ఎమ్మెల్యేలు గెలిచారు. సో.. ఇక్కడ మెరుగ్గానే టీడీపీ పరిస్థితి ఉంది. ఇక, తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరులు.. ఇతర కృష్ణ వంటివాటిలోనూ పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంది.
ఈ క్రమంలో వైసీపీకి బలంగా ఉన్న సీమ జిల్లాలు.. ముఖ్యంగా గత ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. కడపలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. అంటే.. నాలుగు జిల్లాల్లో 2 టీడీపీ పోగొట్టుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో సీమలో పార్టీని పుంజుకునేలా చేయడం.. అలాగే.. వైసీపీ బలాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడం అనేది టీడీపీ ముందున్న ప్రధాన లక్ష్యంగా ఉందని.. అందుకే చంద్రబాబు సీమ డిక్లరేషన్ పేరుతో.. ఇక్కడ పర్యటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.