వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు అహంకారం పెరిగిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. షణ్ముఖ వ్యూహంతోనే ఆయనను గద్దె దింపుతామని చెప్పారు. ఒక దుష్టనేతపై పోరాటం చేస్తున్నామని.. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని సూచించారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలను ఆయన పంచుకున్నారు.
నేతలకు ఆహ్వానం
తన పార్టీలో చేరాలని అనుకునేవారు.. ఎవరైనా వచ్చే చేరొచ్చని పవన్ పిలుపునిచ్చారు. అయితే.. ఎవరూ ప్రజలకు ఓటు కోసం డబ్బులు పంచేందుకు వీల్లేదని.. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. అలాంటివారికే పార్టీలో స్థానం ఉంటుందన్నారు. ప్రజల నుంచికూడా డబ్బులు తీసుకోరాదని చెప్పారు.
“డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు. రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరు. డబ్బుతో ఓట్లు కొనమని నేను చెప్పడం లేదు. భావితరం గురించే ఆలోచించే నేతలు.. ఇతర పార్టీల నుంచి వచ్చినా ఆహ్వానిస్తా.” అని పవన్ వ్యాఖ్యానించారు.
మంగళగిరిలోనే ఉంటా
తాను ఇక నుంచి మంగళగిరిలోనే ఉంటానని పవన్ చెప్పారు. ఎప్పుడైనా సినిమా షూటింగులకు వెళ్లినా.. తిరిగి తాను.. మంగళగిరికే తిరిగి వస్తానని చెప్పారు. తనను ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. తాను ఇక్కడే ఉండి పార్టీకి అవసరమైన అన్ని సలహాలు ఇస్తానని చెప్పారు. జగన్ అనే ఓ దుష్ట నాయకుడిపై పోరాటం చేస్తున్నామన్నారు. నటుడిని కావడం ఒక బలం.. ఒక బరువు కూడా అని పవన్ వ్యాఖ్యానించారు.
సామాన్యులకు పెద్దపీట
“ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైసీపీ భావిస్తోంది. భయపెట్టడం, బెదిరించడమే.. వైసీపీ దృష్టిలో రాజకీయం. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. షణ్ముఖ వ్యూహంతో ఎన్నికలకు వెళ్దాం. ఏపీ అభివృద్ధి తెలంగాణకు అవసరం. ఏపీ అభివృద్ధి అయితేనే తెలంగాణకు వలసలు ఆగుతాయి. రెండు దశాబ్ధాల శ్రమ, కృషిని ఏపీకి పెట్టుబడిగా పెట్టా” అని పవన్ కల్యాణ్ అన్నారు.