ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వారాహి యాత్ర పేరుతో ప్రజల్లో ఉంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను విజయవంతంగా ముగించారు. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రలో తదుపరి వారాహి యాత్రను కొనసాగించనున్నారు. దీంతో రాయలసీమపై పవన్ ఆశలు వదులుకున్నారని, అందుకే వారాహి యాత్ర కొనసాగింపునకు ఉత్తరాంధ్రను ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాయలసీమలో అధికార వైసీపీ బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో సగం సీట్లు వైసీపీ ఖాతాలోనే చేరాయి. ఇక 2019లో అయితే ఏకంగా 49 చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇక్కడ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. దీంతో టీడీపీకే సీమలో దిక్కు లేదు.. అలాంటిది జనసేన అక్కడ నిలబడడం కష్టమేనని పవన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ బలహీనంగా ఉన్న రాయల సీమ కంటే కూడా బలంగా ఉన్న ప్రాంతాల్లో దృష్టి పెట్టడం మేలని పవన్ భావిస్తున్నారని టాక్.
తన సామాజిక వర్గం, అభిమానులు, ఓటు బ్యాంకు ఎక్కడైతే బలంగా ఉందని పవన్ భావిస్తున్నారో అక్కడే వారాహి యాత్రను పరుగులు పెట్టించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మొదట ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు దఫాలుగా వారాహి యాత్ర నిర్వహించారు. ఇప్పుడేమో మూడో విడత యాత్ర కోసం ఉత్తరాంధ్రను ఎంచుకున్నారు. విశాఖ నుంచి ఈ యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.