ప్రజాశాంతి పార్టీ పెట్టి.. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలో తన హావాభావాలతో ఆయన చేసిన సందడి గుర్తే ఉండి ఉంటుంది. ఆ ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్ అయిపోయిన ఆయన.. మధ్యమధ్యలో సమస్యలపై మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో హల్‌చల్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మళ్లీ కేఏ పాల్ యాక్టివ్ అవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
ఈ సారి ఎన్నికల్లో కేఏ పాల్ రాష్ట్రం దాటి చూస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేస్తానని చెప్పారు. అది కూడా విశాఖపట్నం నుంచి. ఇప్పటికే సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖపై గురిపెట్టి అక్కడ పర్యటనలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పడం విశేషం. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు తనకంటే అర్హుడు ఎవరుంటారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
విశాఖ దగ్గర తగరపువలసనే పాల్ సొంత ప్రాంతం. అందుకే తానే ఇక్కడ పక్కా లోకల్ అని పాల్ అంటున్నారు. ఇకపై విశాఖలోనే మకాం పెడతానని, ప్రత్యర్థి పార్టీలకు తన రాజకీయం తడాఖా చూపిస్తానని ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులుగా మారాయని పాల్ విమర్శించారు. విశాఖకు న్యాయం చేసే నాయకుడినే తానేనని, అందుకే ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ సమస్యలపై తనకంటే ఇంకెవరికీ బాగా తెలియదని, ఈ సారి ఇక్కడి నుంచి గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates