సీఎం జగన్ సొంత ఇలాకా కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ నభూతో నభవిష్యత్ అన్నరీతిలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సభలు, రోడ్ షోలకు ఇసకేస్తే రాలనంత జనం వస్తుండడంతో వైసీపీ నేతల కంటి మీద కునుకు ఉండడం లేదు. అందుకే, పులివెందులలో చంద్రబాబు సభను అడ్డుకునేందుకు కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించగా…వారిని టీడీపీ కార్యకర్తలు దీటుగా అడ్డుకున్నారు. ఇక, పులివెందుల సభలో సింహాన్ని అంటూ చంద్రబాబు ప్రసంగించడంతో వైసీపీ నేతలకు గుబులు పట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు కామెంట్లపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.
తాను సింహాన్ని అని పదేపదే చెప్పుకున్నంత మాత్రాన సింహం కాలేరని చంద్రబాబుకు అవినాష్ కౌంటర్ ఇచ్చారు.
“నువ్వు ఎంత సేపు గట్టిగా అరిచి, నేను సింహాన్ని, కొదమ సింహాన్ని అని అరిస్తే అయిపోతావా? సింహం, కొదమ సింహమని ప్రజలు అనుకోవాలి. జనం నిన్ను చూసి కామెడీ అనుకుంటున్నారు. నువ్వు ఓ కమెడియన్ లాంటోడివి” అంటూ చంద్రబాబుపై అవినాష్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు స్వతహాగా భయస్తుడని, అందుకే ధైర్యవంతుడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయినా, అంత పెద్దమనిషికి ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఆ వయసులో కొదమ సింహం అంంటుంటే పిల్లలకు కూడా నవ్వొస్తోందని సెటైర్లు వేశారు. పులివెందులకు వచ్చిన చంద్రబాబు జ్ఞానం లేకుండా మాట్లాడారని, ఆయన మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని విమర్శించారు. చంద్రబాబులా సీఎం జగన్ ఆలోచించి ఉంటే కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసేవారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరి సంకుచితంగా జగన్ ఆలోచించలేరని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates